శివకేశవుల కన్నా ఆది పరాశక్తే మహోన్నతురాలని , మహాశక్తిమంతురాలని గాఢంగా విశ్వసించి , తీవ్రంగా ఆరాధించేవారిని శాక్తేయులని అంటారు. వీరు శక్తిమాతను వివిధ రూపాలలో దర్శించి కొలుస్తారు. పరమేశ్వరుని ధర్మపత్నిగా, మహావిష్ణువు యొక్క సోదరిగా ,గణపతి, కుమారస్వాముల తల్లిగా , ఇంకా మరెన్నో రూపాలలో పూజిస్తారు. అనాదిగా మనదేశంలో శక్తి ఆరాధన జరుగుతున్నది. ఆదిపరాశక్తి దేవి అనేక ప్రాంతాల్లో , పలు పేర్లతో, పలు రూపాలలో పూజించబడుతూ ప్రజలందరిని అనుగ్రహిస్తున్నది.
భారతదేశంలో శాక్తేయుల ప్రాబల్యంతో ఉజ్జయిని , మదురై , కాంచీపురం , శృంగేరి , కామాఖ్య, కాశీ , మొదలైన 51 పవిత్ర క్షేత్రాలలో శక్తిపీఠాలు వెలసి ఆది పరాశక్తి కొలవబడుతున్నది. కొన్ని చోట్ల విద్యాదేవత సరస్వతిగా , మరికొన్ని చోట్ల మహాలక్ష్మిగా , పార్వతిగా , ఆరోగ్య ప్రదాతగా , ఊరి ప్రజలను కాపాడే గ్రామదేవతగా వివిధ రూపాలతో శక్తిమాత ప్రజలను రక్షిస్తున్నది.
అటువంటి శక్తిదేవి యే కొల్లూరు లో కష్టాలు తీర్చే దుర్గాదేవిగా మూకన్ అనే రాక్షసుని సంహరించి మూకాంబికగా కొలువై వున్నది. కర్ణాటక రాష్ట్రంలో తూర్పు దిశగా వున్న కుందాపూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం దమాన్ కొల్లూరు. దక్షిణ కన్నడ ప్రాంతంలో ఉత్తర తూర్పు దిశ సరిహద్దుల్లో యీ ఊరు వున్నది. మంగళూరు నుండి సుమారుగా 140 కి.మీ దూరంలో వున్నది. కుడచాద్రి పర్వతాలలో అవిర్భవించిన సౌపర్ణికా నది ఈ పవిత్ర ఆలయాన్ని చుట్టి ప్రవహిస్తుంది.
దీని సమీపమున 6 అడుగుల ఎత్తున పుట్ట ఒకటి వున్నది. ఇక్కడున్న ఒక ప్రత్యేక ద్వారం ద్వారా ఆది శంకరుల వారు ఆలయంలోపలికి వెళ్ళేవారని ప్రతీతి. అందుకు చిహ్నంగా ఆ ద్వారం యీనాటికి మూసివేసేవుంటుంది. ఆలయం తూర్పు ద్వారం ద్వారా భక్తులు లోపలికి అనుమతించబడతారు. మండపం తరువాత రక్షణ దైవం వీరభద్రుడు, దక్షిణ ప్రాకారంలో పది హస్తాలతో మూషిక వాహనంపై వున్న వినాయకుడు, దక్షిణ తూర్పు దిశగా సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తారు. కుమరస్వామికి ఉత్తర దిశగా సరస్వతీ దేవి మండపం వున్నది.
గర్భాలయంలో రెండు చేతులలో శంఖు ,చక్రాలు ధరించి అభయ హస్తంతో పద్మాసనంలో ఆశీనురాలైన మూకాంబికా దేవి దర్శనమిస్తుంది. దేవి కొలువై వున్న గర్భగుడి అంతా స్వర్ణమయం. గర్భగుడిలో అమ్మవారికి ముందు బంగారురేఖతో రెండు భాగాలుగా విభజించబడి వుంటుంది. ఇక్కడ వున్న శివలింగం ద్వాపరయుగంలో కోలమహర్షి తపమాచరించిన సమయంలో ప్రతిష్టించినదని భక్తుల ధృఢ విశ్వాసం. ఉఛ్ఛకాల సమయంలో అద్దం ద్వారా యీ లింగంపై కాంతిప్రసరణం జరిగినప్పుడు కాంతివంతమైన స్వర్ణ రేఖను దర్శించగలము. అమ్మవారు సువర్ణ వర్ణంతో తేజోమయిగా భక్తులకు అభయమిస్తూంటుంది. అమ్మవారికి ఎఱ్ఱ గన్నేరు పువ్వులు ప్రీతికరమైనవి. మూకాంబికాదేవిని నవమణులతో అలంకరిస్తారు.
అమ్మవారి విగ్రహం పంచలోహ విగ్రహం.
కన్యాకుమారి లో అమ్మవారి నాసికను మాణిక్య ముక్కు పుడకతో అలంకరించినట్లు, కొల్లూరు మూకాంబిక వక్షస్ధలం పై ,నడుముకి మరకత స్వర్ణహారాలుతో అలంకరిస్తారు. మొదటిసారిగా ఆలయానికి వచ్చేవారు అర్చకుని సహాయంతో సౌపర్ణికా నదిలో అర్చకుడు చెప్పిన మంత్రాలు పఠిస్తూ స్నానం చేయిలి.దీనిని సంకల్ప స్నానం అంటారు. పిదప ఒక పళ్ళెంలో పూజా సామాగ్రితో అర్చకుడు చెప్పిన మంత్రాలు పఠిస్తూ ఆలయ గడపపై కొబ్బరికాయ పళ్ళెం పెట్టి ఆలయానికి ప్రదక్షిణంచేసి నమస్కరించాలి. పిదప తాము యిష్టపడే విధానంలో దేవిని ప్రార్ధించుకోవచ్చును. ఎంతో మహిమాన్వితమైన మూకాంబికాదేవి కోరిన కోరికలను వెంటనే ఈడేర్చే కరుణామయి.
No comments:
Post a Comment